జీవీకే గ్రూపుపై ఉచ్చు బిగుసుకుంటోంది. ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఇప్పటికే సీబీఐ కేసు నమోదు కాగా, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. జీవీకే గ్రూపు, ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌) పై ఈడీ ‘మనీలాండరింగ్‌ కేసు’ నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, హైదరాబాద్‌లలో జీవీకే గ్రూపు కంపెనీల అధికార వర్గాలను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఐఏఎల్‌ వ్యవహారాల్లో జీవీకే గ్రూపు అవకతవకలకు పాల్పడినట్లు, దాదాపు రూ.705 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు గత నెల 27న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీంతో సీబీఐ కేసు ఆధారంగా ఈడీ తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘మనీలాండరింగ్‌’ ఏమైనా జరిగిందా? అనే కోణంలో పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వర్గాలు దర్యాప్తు మొదలు పెట్టాయి. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సైతం అవకాశం ఉందని తెలిసింది. దారి మళ్లించిన నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులు, చేపట్టిన వ్యాపారాలు ఉన్నట్లు తేలితే, వాటిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ‘అటాచ్‌’ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలుత సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో, ఎంఐఏఎల్‌తో పాటు, జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, గ్రూపు ఛైర్మన్‌ జీవీకే రెడ్డి, ఆయన తనయుడు- ఎంఐఏఎల్‌ ఎండీ జీవీ సంజయ్‌రెడ్డి, మరో తొమ్మిది కంపెనీలను నిందితులుగా పేర్కొన్నారు.

ఎంఐఏఎల్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఏఏఐ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా) అధికార వర్గాలతో జీవీకే యాజమాన్యం కుమ్మక్కై ఎంఐఏఎల్‌ నిధులను బోగస్‌ కాంట్రాక్టుల పేరుతో దారిమళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. అంతేగాక గ్రూపు కంపెనీలకు ఎంఐఏఎల్‌ నుంచి రూ.395 కోట్ల మేరకు మళ్లించినట్లు పేర్కొంది. నిధులు దారిమళ్లించిన వ్యవహారం బయటకు రాకుండా ఉండటానికి ఎంఐఏఎల్‌ ఖాతాల్లో ఖర్చులు ఎక్కువగా, ఆదాయాలు తక్కువగా చూపినట్లు ఆరోపించింది. సీబీఐ కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉండగానే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం రంగంలోకి దిగటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంస్థ అయిన ఎంఐఏఎల్‌లో జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌కు 50.5 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఏఏఐ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా)కు 26 శాతం వాటా ఉండగా, మిగిలిన వాటా విదేశీ సంస్థల చేతిలో ఉంది.