బంజారాహిల్స్‌: తాను దైవదూతనని నమ్మిస్తూ కష్టాల్లో ఉన్న యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని లక్షలాది రూపాయలు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితురాలిని జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే: కూకట్‌పల్లి వెంకటరమణ కాలనీ, గోకుల్‌ప్లాట్స్‌లో నివసించే సంజన(50) కొంత కాలంగా అమాయక యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ వారిని కష్టాల నుంచి దూరం చేసేందుకు తాను దేవుడితో మాట్లాడతానని, ప్రార్థనలు చేస్తానని చెప్పేది. ఇటీవల ఓ పెళ్లి సంబంధం వచ్చి తప్పిపోయిన సందర్భంగా జూబ్లీహిల్స్‌కు చెందిన యువతి ఆమె ట్రాప్‌లో పడింది.

ఈ జీవితాన్ని గాడిలో పెడతానంటూ పలు దఫాలుగా ఆమె దగ్గరి నుంచి రూ.70 లక్షల దాకా వసూలు చేసింది.
ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంజన గుట్టురట్టైంది. అమాయకులను బుట్టలో వేసుకుంటూ తన అకౌంట్‌లోకి డబ్బులు రాబట్టుకుందని తేలింది. దీంతో నిందితురాలిపై పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 406, 420, 508 కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా నిందితురాలిపై ఓ బాధితురాలు హుమాయన్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయగా అక్కడ మరో కేసు నమోదైంది.