జొమాటో లో బిర్యానీ ఆర్డర్ ఇస్తే సాంబర్ రైస్ వచ్చిందని కష్టమర్ కేర్ కి కాల్ చేస్తున్నారా ? అయితే ఒక్కనిమిషం. సాధారణంగా మనం బుక్ చేసిన ఆర్డర్ రాలేదంటే కష్టమర్ కేర్ కి కాల్ చేసి ఏమైందోనని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడే ఓ చిన్నపొరపాటు చేస్తాం. ఆ పొరపాటే శ్వేత అనే యువతి 1లక్ష రూపాయలు పోగొట్టుకుంది. ఢిల్లీ నోయిడాకు చెందిన శ్వేత అనే యువతి జొమాటోలో ఫిజ్జా ఆర్డర్ చేసింది. అయితే జొమాటో నుంచి వచ్చిన ఆర్డర్ తీసుకొని యువతి కంగుతిన్నది. ఆర్డర్ ఓపెన్ చేస్తే పిజ్జా పాడైపోయింది.

దీంతో సదరు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కష్టమర్ కేర్ కు కాల్ చేద్దామని ఫోన్ నెంబర్ కోసం జొమాటో వెబ్ సైట్ ను పరిశీలించింది. అందులో కష్టమర్ కేర్ నెంబర్ లేకపోవడంతో గుగూల్ లో సెర్చ్ చేసి జొమాటో కష్టమర్ కేర్ కి కాల్ చేసింది. బుక్ చేసిన పిజ్జా పాడైపోయింది. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ హెచ్చరించింది. దీంతో కష్టమర్ కేర్ ఎగ్జిగ్యూటివ్‌. బుక్ చేసిన పిజ్జా డబ్బులు రిటర్న్ చేస్తాం , యూపీఐకి నెంబర్ కు ఓ లింక్ వస్తుంది. ఆ లింక్ ను క్లిక్ చేయాలని చెప్పాడు. దీంతో శ్వేత ఆ లింక్ ను అప్రూవ్ చేసింది.

అంతే క్షణాల్లో శ్వేత కు బ్యాంక్ అకౌంట్లనుంచి సుమారు లక్షరూపాయలు మాయమై..అకౌంట్లని బ్లాక్ అయ్యాయి. దీంతో యువతి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో జొమాటో కష్టమర్ కేర్ నెంబర్ ఎక్కడా లేదని, మోసగాళ్లు ఫేక్ కష్టమర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి..కష్టమర్ల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఆ ఫేక్ కష్టమర్ కేర్ నెంబర్ ఎక్కడ నుంచి తీసుకుంది. ఆ నెంబర్ ఎవరిది అనే వివరాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. త్వరలో నిందితుల్ని పట్టుకుంటామని నోెయిడా పోలీసులు చెబుతున్నారు.