వారంతా ఉన్నత విద్యావంతులు తాము నేర్చుకున్న విద్యలో కొంత నైపుణ్యం సాధించిన తర్వాత వారసత్వంగా రాజకీయాలను ఎంచుకుంటున్నారు అందుకోసం ఒక్కసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేయకుండా ప్రజల నాడి, ఈ ప్రాంత వేడి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు వారసులుగా ఎదగడం కంటే తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు. అయితే వారసత్వమే తమ అరంగేట్రానికి వేదిక కావడంతో ప్రస్తుతం తండ్రి చాటు బిడ్డల్లా తెరమీదకు వస్తున్నారు. ఓరుగల్లులో వారసత్వ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులు తమ పిల్లలను రాజకీయాల్లోకి రావద్దని చెబుతూనే. వారి ఆసక్తిని బట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తున్నారు.

కొందరైతే ఏకంగా రాజకీయంగా పెద్ద పదవులు కాకపోయినప్పటికీ. ప్రజలతో మమేకమవడానికి చిన్న పదవులతో సరిపెడుతున్నారు. వారసులు కూడా తమదైన శైలిలో రాజకీయాలను సోషల్ మీడియాతో ముడిపెట్టి తమ ఆసక్తిని ప్రజాభిముఖంగా తెలియజేస్తున్నారు. ఓరుగల్లు వాకిట తెరపైకి వస్తున్న యువ రాజకీయ వారసులపై నయాసాల్ వేళ స్పెషల్‌ ఇన్ సైడ్. ఓరుగల్లు వినూత్న రాజకీయాలకు వేదిక.

రాజకీయ చైతన్యపు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గడ్డ:

వరంగల్‌ వేదికగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎందరో నేతలు పుట్టుకొచ్చారు. దేశ వ్యాప్తంగా రాజకీయ దురంధరులకు పుట్టినిల్లు ఓరుగల్లు! అందుకే చైతన్యవంతమైన జిల్లాగా అన్ని పార్టీలు ఈ జిల్లానే కేంద్రంగా చేసుకుని తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాయి. రాష్ర్ట వ్యాప్తంగా ఎన్ని పార్టీలకు ఎన్ని ఎదురుగాలులు వీచినా, ఎంత సానుకూల పవనాలు కలిసి వచ్చినా. ఇక్కడ మాత్రం తీర్పు విలక్షణంగా ఉంటుంది ప్రజలతో ఈ ప్రాంతం నిరంతరం ఉద్యమ స్వరాన్ని వినిపిస్తుంది, నాటి నుంచి నేటి వరకు వరంగల్‌ నేలపై ఎందరో రాజకీయ నాయకులు తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూనే తమ వారసులను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో కొందరు సక్సెసయ్యారు. మరికొందరు రాజకీయంగా దెబ్బతిని తిరిగి వేరే వ్యాపకాల్లోకి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎందుకంటే. ఇప్పుడు మళ్లీ ఓరుగల్లులో రాజకీయవారసుల చర్చ మొదలయ్యింది.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు మరింత బలంగా వారసుల రాజకీయరంగ ప్రవేశంపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి వారే తమ వారసులను రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. వారసులు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయంగా ఎదిగేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు లీడింగ్‌లో ఉన్న నేతల వారసులంతా ఉన్నత విద్యావంతులే కావడం. యువతరానికి ప్రతినిధులుగా ముందుకు వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ వారసులను తెరపైకి తేవడంలో కీలకపాత్ర పోషిస్తున్న నేతలలో ముఖ్యంగా

ఓరుగల్లులో రాజకీయ వారసులు:

1. కొండా దంపతులు, 2. కడియం శ్రీహరి, 3. అజ్మీరా చందూలాల్, 4. సిరికొండ మధుసూదనాచారి, లను చెప్పుకోవాలి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు తమ కూతురు సుస్మితాపటేల్‌ను తమ రాజకీయ వారసురాలిగా గతంలోనే ప్రకటించారు. సుస్మితాపటేల్ తమ సొంత ఊరైన గీసుకొండ మండలం వంచనగిరి పీఏసీఎస్ ఛైర్‌పర్సన్‌గా గతంలో పనిచేశారు. అంతేకాకుండా సురేఖ ఎన్నికల ప్రచారం సమయంలో సుస్మితాపటేల్ కీలక పాత్ర పోషించి ఆమె గెలుపుకు కృషి చేశారు. ఆ విధంగా నియోజకవర్గ ప్రజలతో సుస్మితాపటేల్‌కు మంచి సంబంధాలున్నాయి.

ప్రధానంగా:

సుస్మిత తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్ నడిపిస్తున్నారు. డాక్టర్ చదువు చదివిన సుస్మితాపటేల్‌కు రాజకీయంగా అన్ని అంశాలపై అవగాహన ఉంది, అందుకే కొండా దంపతులు సుస్మితను రాజకీయంగా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కొండా సురేఖ అఫీషియల్‌ పేజ్‌ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. తన వారసురాలి రాజకీయ ప్రవేశానికి ఫేస్‌బుక్‌ వేదికగా మూడు నెలల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో కొండా సుస్మిత ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటూ అనుకూలంగా అభిప్రాయాలు రావడంతో ఇప్పుడు కొండా దంపతుల ఆలోచనంతా సుస్మితను ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే దిశగానే కొనసాగుతోందట భూపాలపల్లిలో కొండా సుస్మిత పోటీ చేస్తారని కొండా అభిమానులు అంటున్నారు. మురళి కూడా భూపాలపల్లి సీటుపై గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు సమాచారం.

ఇక వరంగల్‌లో మరో రాజకీయ వారసురాలు కడియం కావ్య:

విద్యాధికురాలే కాకుండా విభిన్న కోణాలలో సామాజిక అంశాలపై సమగ్ర అవగాహన కలిగిన మహిళగా కావ్య ఇప్పటికే సొసైటీలో పేరు తెచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు అయిన కడియం కావ్య తన రాజకీయ అరంగేట్రానికి ఇప్పటి నుంచే వేదిక సిద్ధం చేసుకుంటున్నారు. స్వయంగా డాక్టర్‌ అయిన కావ్య ఆమె భర్త గతంలో కరీంనగర్‌లో డాక్టర్లుగా పని చేసిన అనుభవంతో పాటు తండ్రితో గత ఎన్నికలలో ప్రచారానికి తిరిగిన అనుభవం కలగలిపి ఇప్పుడు సామాజిక సేవా దృక్పథంతో రాజకీయరంగ ప్రవేశం చేయాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం కడియం వెంట అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు.. సామాజిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటున్నారు.

అయితే మొదట్లో:

కడియం తన కూతురుని రాజకీయంగా రావద్దంటూ చెప్పినప్పటికీ ఆమెలో ఉన్న ఆసక్తిని గమనించి గతంలో పోలిస్తే రాజకీయాలు బాగా లేవనీ చాలా జాగ్రత్తగా నిబద్ధతతో మెలగాలంటూ రోజూ కావ్యకు హితోపదేశం చేస్తున్నారట, అసలు కావ్యను తన వారసురాలిగా ప్రకటించడానికి కడియం శ్రీహరి బహిరంగంగా చెప్పుకునేందుకు కొంత ఇబ్బందిపడుతుంటే కొండా మురళి స్వయంగా కడియంకు చెప్పి ఒప్పించినట్టు సమాచారం. దీంతో కడియం తన కూతురిని ఇప్పుడు ప్రతీ సమావేశానికి పార్టీ వేదికల దగ్గరకు తీసుకెళుతున్నారు.

ప్రధానంగా కావ్య ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం కూడా చెబుతున్నట్టు టాక్‌, కడియం డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరిగిన ఎంపీ ఉప ఎన్నికలో చివరి నిమిషం వరకు కడియం కావ్య పేరు కూడా పరిశీలనలో ఉండింది. అప్పట్లో కావ్యను అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కడియం ఒప్పుకోకపోవడం వల్లే వేరొకరికి అవకాశం దక్కిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈసారి అలా కాకుండా పకడ్బందీగా పూర్తిగా ప్రజల సమస్యలు నియోజకవర్గంపై అవగాహన వచ్చిన తర్వాతనే స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి పోటీ చేయాలా? లేక వర్ధన్నపేట నుంచి పోటీ చేయాలా? అనేది నిర్ణయించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే రాజకీయాలలో:

ఇక ఇప్పటికే రాజకీయాలలో ఉన్న వ్యక్తిగా ములుగు ఏరియాలో తన ప్రాతినిధ్యాన్ని కనబరుస్తున్న నేత అజ్మీరా ప్రహ్లాద్‌ తన తండ్రి చందూలాల్‌ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రహ్లాద్‌ ములుగు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. చందూలాల్‌ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులపై ఎక్కువగా ప్రహ్లాద్‌ పర్యవేక్షించడంతో పాటు నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడంలో ముందుంటున్నారని చందూలాల్‌ వర్గీయులు చెబుతున్నారు. ప్రహ్లాద్ స్వయంగా డాక్టర్ కావడంతో హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తూనే నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. మొదట్లో ప్రహ్లాద్ రాజకీయాల్లోకి రానని మొండికేసినా తన తండ్రి ప్రోద్బలంతో పాటు మిత్రుల ప్రోత్సాహం కారణంగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. చందూలాల్ గెలుపుకోసం కృషిచేసిన ప్రహ్లాద్ ఆ తర్వాత నియోజకవర్గం ప్రజలతో రెగ్యులర్‌గా టచ్ ఉంటున్నారు. ఈయన కూడా ములుగు నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో నేత స్పీకర్ మధుసూదనాచారి తనయులు కూడా రాజకీయరంగ ప్రవేశం చేసి పార్టీలో జిల్లా స్థాయి పదవులు పొందినా.

కారణాల వల్ల:

ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల మౌనంగా ఉంటున్నారు. తిరిగి ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో తిరగాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వీరందరిదీ ఒక ఎత్తైతే దాస్యం ఫ్యామిలీది మరో కహానీ. దాస్యం ప్రణయ్ భాస్కర్ అంటే వరంగల్ జిల్లా నేతలందరికీ సుపరిచితం. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఆయన మరణం తర్వాత ప్రణయ్ తమ్ముడు దాస్యం వినయ్ భాస్కర్ టీఆర్ఎస్ పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యేగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఇదే దాస్యం ఫ్యామిలీ నుంచి మరో కొత్త వారసుడు బయటకు వచ్చారు. ఎప్పుడెప్పుడు రాజకీయ అరంగేట్రం చేద్దామా అంటూ ఉవ్విళ్లూరుతున్నారు దాస్యం అభినవ్ భాస్కర్. మాజీ మంత్రి, దివంగత నేత ప్రణయ్ భాస్కర్ కుమారుడు అభినవ్ ప్రస్తుతం తన బాబాయ్‌తో కలిసి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారికి చేరువయ్యారు. ఎంబీఏ ఫైనాన్స్ చదివి అమెరికాలో కొన్నేళ్ల పాటు ఉండి వచ్చిన అభినవ్ చిన్ననాటినుంచే రాజకీయాల పట్ల ఆసక్తి, తన తండ్రి బాబాయ్ గెలుపు ఓటముల విషయంలో పూర్తి స్థాయి అవగాహన కలిగి నెమ్మది తనంతో పూర్తి స్థాయి రాజకీయ నేతగా ఎదగడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

మొత్తంమ్మీద:

వరంగల్ జిల్లాలో ఈ రాజకీయ వారసుల రంగప్రవేశం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. విభిన్న వర్గాలు ఈ యువత నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రాతినిధ్యం కనబరుస్తుందన్న విషయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుభవరాహిత్యం వీరికి రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడుతుందని కొందరంటే వారు ఇప్పటికే ఎలాంటి పదవీ లేకుండా ప్రజలతో మమేకమవుతున్నారని నేతల అనుచరులు చెబుతున్నారు. రాష్ట్రంలో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు వంటి యువ నేతల హవా కొనసాగుతుంటే.

వరంగల్ లో కూడా యువరక్తమే కావాలంటూ అభిమానులు పట్టుబడుతున్నారట. ఈ ఒత్తిడి కూడా ఓ కారణంగా యువనేతలంతా నియోజకవర్గాల్లో ఓటర్లను, ప్రజలను కలుసుకుని వారితో మమేకం అవుతున్నారు. పలువురు నాయకుల కుమారులు గత ఎన్నికల్లో తమ తండ్రులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌, జనసమీకరణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నియోజకవర్గాలలోని ద్వితీయ స్థాయి నాయకులతో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఈ అంశాలు కలిసి వస్తాయన్న భావన అందరిలో కనిపిస్తోంది. మరి ఈ యువనేతల అరంగేట్రం తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ ఓరుగల్లు రాజకీయ సమీకరణాలను ఎలా మారుస్తుంది.? నేతల ఆశలకు అధిష్టానం సహకరించే అవకాశముందా.? నియోజకవర్గ ప్రజలు వీరిని ఆదరిస్తారా.? ఇన్నాళ్లూ తండ్రి చాటు పిల్లల్లా ఉన్నవారికి ఈ సంవత్సరంలో రాజకీయ ఎదుగుదల ఉంటుందా.? కాలమే తేల్చాలి.