కరీంనగర్ జిల్లాలో ఈటల రాజేందర్ అనుచరురాలు, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయను గద్దె దింపడమే లక్ష్యంగా ఓ వర్గం పావులు కదుపుతోందనే వార్తలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇటీవలే కరీంనగర్ జిల్లా చొప్పదండి సమీపంలోని ఓ మామిడి తోటలో 11మంది జడ్పీటీసీ సభ్యులు సమావేశం కావడం ఇందుకు ఊతమిస్తోంది. జడ్పీ చైర్‌పర్సన్‌ను పదవి నుంచి విజయను ఎలా తప్పించాలనే అంశంపై వీరంతా చర్చించారని తెలుస్తోంది. అయితే ఈ విషయం మంత్రి ఈటలకు తెలియడంతో ఆయన రంగంలోకి దిగారని జడ్పీటీసీలందరినీ పిలిపించుకొని బుజ్జగించినట్లు తెలుస్తోంది. అయితే ఈటల నిలబెట్టిన జడ్పీ చైర్ పర్సన్‌పై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానానికి రెడీ కావడం వెనుక ఒక కీలక నేత హస్తం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్‌గా కనుమల్ల విజయ రెండేళ్ల కింద బాధ్యతలు చేపట్టారు. ఈమె ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం హుజూరాబాద్ పరిధిలోని ఇల్లందకుంట మండలానికి చెందినవారు. మంత్రి అనుచరురాలు కావడంతో అప్పట్లో ఆయన పట్టుబట్టి మరీ ఆమెను జడ్పీ చైర్ పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈటల నియోజకవర్గానికి చెందిన విజయ, మొదట్లో హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇటీవలే బయటి నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. కానీ

మొదటి నుంచి జడ్పీటీసీ సభ్యులకు, ఈమెకు మధ్య గ్యాప్ కొనసాగుతోంది. అయితే జిల్లాలోని 15 జడ్పీటీసీ స్థానాల్లో ఒక చైర్ పర్సన్, ఒక వైస్ చైర్మన్‌ పోగా, మిగిలిన 13 మందిలో 11 మంది మీట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం 10 రోజుల కిందట చొప్పదండి మండలంలోని ఓ మామిడి తోటలో జడ్పీటీసీ సభ్యులు భేటీ అయ్యారు. చైర్‌పర్సన్ ఎన్నికై త్వరలో రెండేళ్లు పూర్తవుతున్నందున అవిశ్వాస తీర్మానం పెట్టాలని చర్చించుకున్నారు. ప్రధానంగా విజయ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ఆరోపించారు. ఎస్ఎఫ్‌సీ, డీఎంఎఫ్‌టీ ఫండ్స్‌లో తమకు న్యాయమైన వాటా రావట్లేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను తప్పిస్తే కొత్త చైర్ పర్సన్ అయ్యే అవకాశం ఒక్క చొప్పదండి జడ్పీటీసీ సభ్యురాలికే ఉంది. చొప్పదండిలో మీటింగ్ జరగడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది .అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ పెద్ద నాయకుడు ఉన్నాడని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈటలకు, గంగులకు మధ్య అంతర్గతంగా మాటల యుద్ధం నడుస్తుంది. అయితే ఈటల రాజేందర్ నిలబెట్టిన జడ్పీ చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి 11 మంది జడ్పీటీసీలు ప్లాన్ వేస్తున్నారనే విషయం ఆయనకు తెలియడంత జడ్పీటీసీలందరినీ మంత్రి హుటాహుటిన హుజూరాబాద్ పిలిపించారు. చైర్ పర్సన్‌ను కూర్చోబెట్టి ఆయా సమస్యలపై చర్చించారు. సొంత పార్టీలో ఉంటూ ఇలాంటి పనులు చేయొద్దని ఏ సమస్య ఉన్నా తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పంపించారు. ఇది జరిగిన తర్వాత మూడు రోజుల కింద కూడా ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్సఫర్లలో తమ మాట చెల్లడం లేదని, మరోసారి ఐదుగురు జడ్పీటీసీలు మంత్రి ఈటలను కలిశారు. దీంతో ఆయన జడ్పీ చైర్ పర్సనను హైదరాబాద్ పిలిపించి మందలించినట్లు సమాచారం.