తెలంగాణ రాజకీయాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఇందు కోసం టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలపై దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగి ఇప్పుడు లూప్‌లైన్‌లో ఉన్న కొందరు నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. అలా బీజేపీ ఫోకస్ పెట్టిన నేతల జాబితాలో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారని టాక్. టీడీపీ హయాంలో ఖమ్మం జిల్లాలో తుమ్మల చక్రం తిప్పారు. ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరి మళ్లీ జిల్లాపై తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన అదృష్టం పూర్తిగా అడ్డం తిరిగింది. అప్పటి నుంచి టీఆర్ఎస్‌లో ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ఒకసారి ఖమ్మం జిల్లా నేతల పంచాయతీ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తుమ్మలను పిలిపించుకుని మాట్లాడారు. అయినా తుమ్మల మాత్రం పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు.

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన అంత యాక్టివ్‌గా పని చేయలేదనే వాదనలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తుమ్మలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఇందుకోసం ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరిని రంగంలోకి దించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఉన్న సమయంలో సుజనా చౌదరి, తుమ్మల నాగేశ్వరరావు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కూడా. దీంతో సుజనా చౌదరి ద్వారా తుమ్మలను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందని సమాచారం. బీజేపీలో చేరితే తుమ్మలతోపాటు ఆయన కుమారుడికి కూడా రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్‌లో కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న తుమ్మల బీజేపీ వైపు చూస్తే అందులో సుజనా పాత్ర ఉన్నట్టే అనే టాక్ బలంగా వినిపిస్తోంది….