మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో జోష్ మీదున్న టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగేలా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నారనే ప్రచారం సాగుతోంది. గురువారం ములుగు జిల్లా వాజేడులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. తుమ్మల స్వగ్రామమైన గండుగులపల్లి నుంచి వాజేడుకి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. గండుగులపల్లి నుంచి భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల మీదుగా వాజేడుకి సుమారు 300 వాహనాలతో తుమ్మల నాగేశ్వరరావు భారీ కాన్వాయ్‌తో రానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు భారీగా వాజేడుకు తరలివస్తున్నట్లు తెలిసింది. ఈ సమావేశం టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధం లేకుండానే జరుగుతోందని తుమ్మల సన్నిహితులు చెబుతున్నారు. దీంతో రాజకీయంగా తుమ్మల ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. గత కొన్ని రోజులుగా తుమ్మల పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ వస్తున్నారు.

తాజాగా అనుచరులతో రహస్య సమావేశం నిర్వహిస్తుండటంతో పార్టీ మార్పు దిశగా తుమ్మల నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తుమ్మల ఆత్మీయ సమ్మేళనంపై ఇంటెలిజన్స్ వర్గాలు నిఘా పెట్టినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో గులాబీ తీర్థం పుచ్చుకున్న తుమ్మల ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే తనకు ఉన్న పలుకుబడితో ఎమ్మెల్సీగా ఎన్నికై కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయనను అధిష్టానం పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది. మళ్లీ ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని తుమ్మలు ఆశలు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం లేదనే టాక్ వస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్‌కు గుడ్ బై చెబితే తుమ్మల ఏ పార్టీలోకి వెళతారనే చర్చ కూడా జరుగుతోంది. బీజేపీలోకి వెళతారని కొంతకాలం నుంచి ప్రచారం ఊపందుకుంది. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవమని ఇన్నాళ్లు ఖండించారు. మరి నేటి సమావేశంలో తన నిర్ణయం అనుచరులతో పంచుకుంటారా..? లేదా మరేదైనా విశేషం ఉందా..? అనేది చూడాలి.