రాష్ట్ర సాధనకు కేంద్ర బిందువైంది, రెండుసార్లు వరుసగా అధికారం చేజిక్కుంచుకొంది గులాబీ గుబాళింపుతో ఆకర్షితులై గతంలో చాలా మంది ఆ పార్టీలోకి వలస వెళ్లారు ఇప్పుడదే పార్టీ వేరే పార్టీలోకి నేతలు వలస పొకుండా కష్టపడాల్సి వస్తోంది కమలం ఆపరేషన్ ఆకర్ష్ ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ అగ్రనేతల పన్నుతున్న వ్యూహాలు పార్టీ నేతల జంపింగ్ లకు చెక్ పెడతాయా.? తెలంగాణ గడ్డపై తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్‌కు పేరు. ఇప్పుడీ పార్టీలో తొలిసారి వలసల భయం పట్టుకుంది. గులాబీ నేతల్లో కొందరు ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూస్తున్నారట. ఈ సంకేతాలతోనే పార్టీ పెద్దలు సైతం అప్రమత్తమయ్యారని గులాబీ దళంలో టాక్‌ నడుస్తోంది. టీఆర్‌ఎస్‌ను వీడతారన్న నేతలను బుజ్జగించే పనిలో పడ్డారట పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విపక్ష పార్టీలు అప్పట్లో విలవిల్లాడాయి.

తెలంగాణ రాజకీయాల్లో మార్పులు:

దుబ్బాక ఉపఎన్నిక పోరుకు ముందు వరకు ఏకపక్షంగా కనిపించిన తెలంగాణ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తున్నాయిప్పుడు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ ఆ దిశగా దూసుకుపోతుందని పలు పార్టీల నేతలు భావిస్తున్నారట. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడంతో కమలనాథులు పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. పలు పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. అధికార పార్టీ నుంచి కూడా రివర్స్‌ ఆపరేషన్‌ చేపట్టాలని కమలనాథులు చకచకా పావులు కదుపుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. వారిలో కొందరికి పార్టీపై అసంతృప్తి ఉందట. ప్రస్తుతానికి టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్న ఆ అసంతృప్తు నేతలను తమ దారికి తెచ్చుకునేందుకు రాష్ట్ర, కేంద్ర బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ బీజేపీలో చేరిపోయారు.

మాజీ మంత్రులపై దృష్టి:

దీంతో బీజేపీ ఇంకెవరిపై కన్నేసిందన్నదానిపై గులాబీదళంలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని పొలిటికల్‌ సర్కిళ్లలో టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలో కొందరి పేర్లు బయటపడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రులపై బీజేపీ దృష్టిసారించిందట. ఈ కోవలో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, మహేందర్‌రెడ్డి ఉన్నారు. వీరంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం రోజురోజుకు ఎక్కువైపోతుందని టాక్. గతంలో పలు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలోనూ అసంతృప్తిని గమనిస్తున్నారు కమలనాథులు. ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు పదవులు దక్కని నేతల్లో పలువురు బీజేపీకి దగ్గరవుతున్నారన్న చర్చ అధికారపార్టీలో జరుగుతోంది. ఇందులో ప్రముఖంగా వినిపించిన పేరు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

పావులు కదుపుతున్న టీఆర్ఎస్ నేతలు:

గత సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీ అయిన తనకు సీటు కేటాయించకపోవడం, ఆ తర్వాత ఇంతవరకు ఎలాంటి పదవి దక్కకపోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారనే టాక్‌ నడిచింది. దీంతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రంగంలోకి దిగారు. పొంగులేటిని ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారని తెలుస్తోంది. అదే సమయంలో తమ్ముల నాగేశ్వరరావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపించుకుని మాట్లాడారని ఓ టాక్‌ ఉంది. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న నామినేటేడ్ పదవులను భర్తీ చేసి నేతలు, పార్టీ మారకుండా చూడాలన్నా అభిప్రాయంతో టీఆర్‌ఎస్ నేతలు పావులు కదుపుతున్నారట.