టీకా రెండు డోసులు తీసుకున్న సీనియర్‌ పోలీస్‌ అధికారికి కరోనా సోకింది. వ్యాక్సిన్‌ ఒక డోసు తీసుకున్న ఆయన భార్యతోపాటు, రెండు డోసులు తీసుకున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు కరోనా సోకినట్లు ఉత్తరప్రదేశ్‌ బరేలీకి చెందిన ఐజీ రాజేష్‌ పాండే గురువారం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. తన భార్యతోపాటు సెక్యూరిటీగా ఉన్న పోలీస్ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని చెప్పారు. మూడు రోజుల కిందట తన కుమారుడు కరోనా బారినపడినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 5న కరోనా టీకా తొలి డోసు, మార్చి 5న రెండో డోసు తీసుకున్నట్లు రాజేష్‌ పాండే పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా టీకా రెండు డోసులు, తన భార్య ఒక డోసు తీసుకున్నట్లు వివరించారు.

తాను ప్రస్తుతం ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించేకోవాలని ఆయన సూచించారు. మరోవైపు ఐజీ రాజేష్ పాండే, బరేలీ రేంజ్‌ నుంచి ఇటీవల బదిలీ అయ్యారు. లక్నో ఎలక్షన్‌ సెల్‌ ఇన్‌చార్జ్‌గా ఆయనను నియమించడంతో బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొన్ని వస్తువులను తెచ్చుకునేందుకు బరేలీలోని తన ఇంటికి వెళ్లిన ఆయన కరోనా బారినపడ్డారు.