దేని గిరాకి తగ్గినా టీ గిరాకి మాత్రం తగ్గదు. అలా సరదాగా టీ స్టాల్‌కు వెళ్లి అల్లం టీనో, లెమన్ టీ, కాఫీ, బ్లాక్ టీ ఇలా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. అక్కడ మాస్టర్ టీ చేసే విధానం మన దృష్టిని ఆకర్షిస్తుంటుంది. నగరాల్లో అడుగడుగునా టీస్టాళ్లు వెలిసాయి. దీంతో టీ మాస్టర్ల కొదవ ఏర్పడినట్టే వుంది. ఎందుకంటే టీ మాస్టర్లు కావాలని ఓ ప్రకటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మంచి అనుభవం కలిగిన టీ మాస్టర్‌కు కావలెను.. నెలకు రూ. 16,000 నుంచి రూ.19,000 వరకు జీతం ఇస్తామని ప్రకటించారు టీస్టాల్ ఓనరు. అలాగే కింద అసిస్టెంట్ టీ మాస్టర్ కూడా కావలెను అని కూడా ప్రకటన ఇచ్చారు. అతనికి నెలకు రూ.14,000 నుంచి రూ.16,000 వరకు జీతం ఇస్తామని ప్రకటిస్తూ కింద తమ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ ప్రకటనను చాలామంది షేర్లు చేస్తున్నారు. టీమాస్టర్ల కొదవ ఏర్పడింది అనడానికి ఈ ప్రకటన ఉదాహరణగా నిలుస్తోంది. టీమాస్టర్లకు కూడా ఇంత జీతం ఇస్తారా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అప్పట్లో టీమాస్టర్లకు ఇన్నేసి జీతాలు ఇచ్చేవారు కాదు. పని కూడా కష్టంగా వుండేది. బులేర్ తిప్పుతూ చాయి చేసేవారు. చాలీచాలని జీతాలతో పాపం వాళ్లు కుటుంబాలను నెట్టుకురావడం కష్టంగా వుండేది. ఇప్పుడంటే గ్యాస్ స్టౌల పైనే స్మార్టుగా టీ చేస్తున్నారు.