కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. భక్తులందరికీ టైం స్లాట్‌ టోకెన్ల ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్టు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. మంగళవారం నుంచి భక్తులను కంపార్టుమెంట్లలో కూర్చోనివ్వకుండా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. తిరుమల వచ్చే భక్తులు తప్పకుండా తమవెంట గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని సూచించారు.

గంటకు 4500 మంది శ్రీవారిని దర్శించుకొనేలా టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేస్తున్నట్టు చెప్పారు. అందువల్ల భక్తులంతా నిర్ణీత సమయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు. లోకశాంతి కోసం యాగం నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున శ్రీ శ్రీనివాస శాంతి ఉత్సవసహిత ధన్వంతరి మహాయాగం చేపడతామన్నారు. ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరుగుతుందని చెప్పారు. మరోవైపు, ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారామ కల్యాణం వాయిదా వేస్తున్నట్టు చెప్పారు.