తండ్రి ప్రాణాలు పోవాలని కోరుకున్న వ్యక్తి, ఆస్తుల కోసం ఇప్పుడు హఠాత్తుగా ప్రేమ నటిస్తోందని అమృతనుద్దేశించి ఆమె చిన్నాన్న, ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు శ్రవణ్ అన్నారు. ఆమె వల్లే దారుణాలు జరిగాయని, ఇప్పుడు డబ్బు కోసమే డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన శ్రవణ్, మారుతీరావును నాన్న అని పిలవడానికి అమృత ఇష్టపడడం లేదని మండిపడ్డారు. సోదరుడికి చెందిన ఒక్క పైసా తనకు అక్కర్లేదని చెప్పారు.

మీడియాలో హడావుడి చేయడానికే అమృత ఇదంతా చేస్తోందని ప్రత్యారోపణలు చేశారు. అమృత అంటే మారుతీరావు ఎంతో ప్రేమతో ఉండేవాడని, బిడ్డను ఒక్కరోజు కూడా ఏమీ అనలేదని తెలిపారు. మారుతీరావు చనిపోయే ముందు వరకు ఉరి తీయాలని డిమాండ్ చేసిన ఆమె, ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ప్రణయ్ హత్యకు ముందు తనకు, అన్నయ్య మారుతీరావుకు మాటల్లేవని చెప్పారు.

అమృత విషయంలోనే గొడవలు జరిగాయన్నారు. తండ్రి చనిపోతే శుభవార్త అన్న అమృత ఇప్పుడు ఆయన ఆస్తి కోసం, డబ్బు కోసం డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. నిన్నటి వరకు లేని ప్రేమ ఇప్పుడెలా పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు.తల్లి మీద ప్రేమ ఉంటే నిన్నటి నుంచి ఎందుకు రాలేదని నిలదీశారు. వాళ్ల అమ్మ దగ్గరకు వస్తే తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. అన్యాయంగా తనను జైలుకు పంపించారని శ్రవణ్‌ అన్నారు.