ములుగు ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పుట్టిన బిడ్డ మృతిచెందిందని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బాలింత బంధువులు ఆసుపత్రి ముందు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు గంట సేపు ఆందోళన సాగింది. పోలీసులకు ఆందోళన కారులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. రాస్తారోకో విరమించేందుకు ఆందోళనకారులు ససేమిరా అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సై బండారి రాజు వచ్చి వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.

బాలింత మేనత్త వసంత తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామానికి చెందిన చల్లూరి మౌనిక కాన్పు కోసం ఈ నెల 21న మళ్లీ కాన్పు కోసం ఆసుపత్రికి రాగా అడ్మిట్‌ చేసుకున్నారు. 22న రాత్రి 2.00 గంటల సమయంలో పాప పుట్టింది. పాప ఉమ్మనీరు తాగిందని వెంటనే వరంగల్‌ తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ల సూచనల మేరకు పాపను హైదరాబాద్‌ తరలించగా పరిస్థితి విషమించి పాప మృతిచెందింది. ఏరియా ఆసుపత్రిలో డాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయిందని, తల్లికి రక్తస్రావమై పరిస్థితి విషమంగా ఉందని వారు ఆరోపించారు.

తప్పు జరిగిందని వైద్యులే ఒప్పుకుంటున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నారాయణరెడ్డిని వివరణ కోరగా, మౌనికకు సాధారణ ప్రసవం అయిందని, తల్లీ, బిడ్డకు సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు. మరుసటి రోజు వరంగల్‌కు సిఫారసు చేశామని అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిపారు. డాక్టర్‌ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటానన్నారు.