బుల్లితెరపై బాహుబలి అంటే మరో అనుమానం లేకుండా కార్తీక దీపం సీరియలే. దానికి ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది. వంటలక్క దెబ్బకు రికార్డులు షేక్ అయిపోతున్నాయి. ఎంతమంది వచ్చినా కూడా వంటలక్క మాత్రం సింగిల్, గుంపుగా వచ్చినా ఒంటి చేత్తో రేటింగ్స్ తీసుకొస్తుంది వంటలక్క. ఆమె జోరును తట్టుకోవడం చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల వల్లే కాలేదు. బాహుబలి సినిమా వచ్చినా కూడా వంటలక్క తర్వాతే అక్కడ. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. రాత్రి 7.30 అయిందంటే చాలు ఇంట్లో ఉన్న ఆడాళ్లంతా పనులు పక్కనబెట్టేసి మరీ టీవీల ముందు కూర్చుంటారు. అది వంటలక్క పవర్ అంటే. అన్ని ఎపిసోడ్స్ కనీసం 18కి తగ్గకుండా రేటింగ్ వస్తుందంటే రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఈ సీరియల్ వల్లే మా టీవీ నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతుంది. అంతగా కార్తీక దీపం సీరియల్‌కు అడిక్ట్ అయిపోయారు ప్రేక్షకులు.

ఇలాంటి సమయంలో వంటలక్కను టచ్ చేస్తే ఎవరికైనా అంతే సంగతులు. అలాంటిదిప్పుడు ఐపిఎల్ 13వ సీజన్ కోసం రాత్రి 7.30కి మొదటి మ్యాచ్ మొదలవుతుంది. ఇండియాలో ఉన్నపుడు 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్ కాస్తా ఇప్పుడు దుబాయ్ కావడంతో అరగంట ముందే మొదలు కాబోతుంది. దాంతో వంటలక్కకు పోటీగా ఐపిఎల్ వస్తుంది. కానీ అది కుదిరేలా కనిపించడం లేదు. ఆ టైమ్‌కు ఐపిఎల్ కాదు కదా బ్రహ్మదేవుడే దిగొచ్చినా ఇంట్లో ఆడాళ్లు రిమోట్ ఇచ్చే ప్రసక్తే ఉండదు. మార్చితే మర్డర్స్ అయిపోతాయి అంటారు కూడా. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా ఐపిఎల్ టైమింగ్ మార్చాలంటూ ఏకంగా సౌరవ్ గంగూలీనే ట్యాగ్ చేస్తూ ఓ కుర్రాడు ట్వీట్ చేసాడు. సర్ మా ఇంట్లో ఒకే టీవీ ఉంది, రాత్రి 7.30కి కార్తీక దీపం సీరియల్ వస్తుంది, అప్పుడు కానీ రిమోట్ తీసుకుంటే రెండో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది, దయచేసి మ్యాచ్‌ల టైమింగ్ మార్చండి అంటూ గంగూలీని, మా టీవీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. దీనికి స్టార్ మా కూడా రిప్లై ఇచ్చింది. ఇది నిజంగా జెన్యూన్ రీజన్‌లా కనిపిస్తుంది అంటూ వాళ్లు రీ ట్వీట్ చేసారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు 60 ఐపిఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.