డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లకు భయపడి ఓ వ్యక్తి విచిత్రమైన ప్లాన్ వేశాడు. మద్యం సేవించిన తనను పోలీసులు పట్టుకుంటారమోనన్న భయంతో భార్యను, బైక్ వద్ద ఒంటరిగా వదిలేశాడు. అయితే ఇది పోలీసులు గమనించడంతో అతని ప్లాన్ బెడసి కొట్టింది. ఈ ఘటన శనివారం రాత్రి శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు: ఓ గెట్ టూగెదర్ కార్యక్రమానికి హాజరైన తర్వాత రాజు, అతని భార్య సీత బైక్‌పై ఇంటికి బయలుదేరారు. అయితే వారు వస్తున్న రూట్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం గమనించిన రాజు ఆందోళన చెందాడు. మద్యం సేవించి బైక్ నడుపుతున్న తనను పోలీసులు పట్టుకుని, జరిమానా విధిస్తారని భయపడిపోయాడు.

దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకప్ నుంచి తప్పించుకునేందుకు తన భార్యను బైక్ వద్ద వదిలిపెట్టి జంప్ అయ్యాడు. ఇది గమనించిన పోలీసు పెట్రోలింగ్ టీమ్ రాజును పట్టుకుంది. అలాగే అతని వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజు, సీతా దంపతులను శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. వారు అక్కడ ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి తాగి వాహనం నడపరాదని రాజును హెచ్చరించారు. రాజు మత్తు దిగిందని నిర్దారించుకున్న తర్వాత అతన భార్యతో కలిసి ఇంటికి వెళ్లేందుకు అనుమతించినట్టు పోలీసులు తెలిపారు.