డ్రగ్స్‌ వ్యవహారం కర్నాటక సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు మరికొందరిని అరెస్టు సీసీబీ అధికారులు.. తాజాగా మరో నటి సంజనా గల్రానీని అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం 6.30గంటల సమయంలో బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఆమె నివాసానికి వచ్చిన పోలీసులు దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు చేశారు. ఆమె ఇంట్లోని పూల కుండీలు, వంటగది, ఆమె గది, బాల్కనీ, కార్లలోనూ తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆమెను ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరు పరిచి పోలీస్‌ కస్టడీకి అడుగుతామని అధికారులు తెలిపారు.
అలాగే, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వీరెన్‌ ఖన్నా అనే వ్యాపారవేత్త ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బెంగళూరులో పెద్ద పెద్ద పార్టీలు నిర్వహిస్తుంటారు. మంగళవారం వీరిద్దరి ఇళ్లల్లో సోదాలు కోసం కోర్టునుంచి అధికారులు సెర్చ్‌ వారెంట్లు తీసుకొని రంగంలోకి దిగారు.

ఈ వ్యవహారంలో సంజనా సన్నిహితుడైన రాహుల్‌ థోన్సే కూడా కొద్దిరోజుల క్రితమే అరెస్టయిన విషయం తెలిసిందే. అతడితో పాటు మరికొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సంజన నివాసంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. తన ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో కొద్ది సమయం పాటు పోలీసులకు సహకరించిన సంజన. ఆ తర్వాత వారితో వాదనకు దిగినట్టు సమాచారం. సోదాల సమయంలోనే బ్రేక్‌ఫాస్ట్‌ బయట నుంచి అధికారులు తెప్పించినా తొలుత ఆమె తినేందుకు నిరాకరించారనీ, ఆ తర్వాత తిన్నారని తెలిపారు. సంజన ఇంట్లో ల్యాప్‌టాప్‌, హర్డ్‌ డిస్క్‌, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, సంజన కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేసే సిబ్బందిని కూడా ప్రశ్నించారని సమాచారం.