ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రికి కాలేయ దానం చేసిన కొడుకు

ఏమిచ్చినా కన్న తండ్రి రుణం తీర్చుకోలేనిదని గ్రహించిన ఓ యువకుడు తండ్రికి కాలేయ దానం చేసి తండ్రి ప్రాణాన్ని నిలబెట్టాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాకాల్‌రోడ్డులో నివసిస్తున్న సువర్ణపాక సమ్మయ్య మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురికాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి లో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

వైద్యపరీక్షల్లో కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని, పరిస్థితి విషమించిందని కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించడంతో కుటుంబమంతా దిగాలుపడ్డారు. కాలేయదానం కోసం సమ్మయ్య చిన్న కుమారుడు సునీల్‌దీప్‌ ముందుకు రావడంతో వైద్యులు ఈ నెల 8న సునీల్‌దీప్‌ నుంచి కాలేయాన్ని సేకరించి సమ్మయ్యకు ఆపరేషన్‌ విజయవంతంగా నిర్వహించారు. దీంతో సమ్మయ్య ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడంతో కుటుంబమంతా ఊపిరిపీల్చుకుంది. తండ్రికి కాలేయదానం చేసి ఆదర్శంగా నిలిచిన సునీల్‌దీ్‌పను బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు.