ప్రేమించి పెళ్లి చేసుకొని ఏడాదిన్నర తర్వాత ఐపిఎస్ రాగానే విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని భార్య భావన ఆరోపించింది. కడప జిల్లాకు చెందిన వెంకట్ మహేశ్వర్ రెడ్డి, బోయిన్ పల్లి తుమ్మాయి గూడకు చెందిన భావన గత ఏడాది ఫిబ్రవరిలో కీసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐపిఎస్ గా ఎంపికైన తర్వాత మహేశ్వర్ రెడ్డి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని భావన ఆరోపించింది. భర్తపై కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని, మహేశ్వర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది.

అదే విధంగా మహేశ్ రెడ్డి స్నేహితుడు నాగేందర్ రెడ్డి కూడా తనను వేధించారని భావన అన్నారు. వారిద్దరూ కలిసి తక్కువ కులం అంటూ తనను మానసిక వేదనకు గురిచేశారని, ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. తెలంగాణ డిజిపి, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వద్దకు వెళితే వారు కూడా సరైన రీతిలో స్పదించలేదని, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఐపిఎస్ హోదాను ప్రదర్శించారని కూషాయిగూడ ఎసిపి శివకుమార్ తమను నీచంగా చూస్తున్నారని ఆరోపణలు చేసింది.

ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోగా ఇబ్బందులే ఎక్కువగా ఎదురయ్యాయని వాపోయింది. అయితే, భార్య భావన ఫిర్యాదు మేరకు గత నెల 27న మహేశ్వర్‌రెడ్డిపై కేసులు నమోదు చేశామని రాచకొండ సిపి మహేశ్ భగవత్ తెలిపారు. మహేశ్వర్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైన విషయాన్ని శిక్షణ కేంద్రానికి తెలిపాం. ముస్సోరీలోని ఐపిఎస్ శిక్షణ కేంద్రానికి లేఖ రాశాం. మహేశ్వర్‌రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. మహేశ్వర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ భావన తరపున కౌంటర్ దాఖలు చేశామని పేర్కొన్నారు…