భర్త మొదటి భార్య బిడ్డను తల్లి స్థానంలో ఉండి ఆలనా పాలనా చూస్తూ వచ్చిన పిన్ని హఠాత్తుగా ఉన్మాది అయింది. తన కడుపున పెరుగుతున్న పిండాన్ని చంపుకోవాలన్న భర్త హెచ్చరికతో కసాయిగా మారింది. తన బిడ్డ కోసం సవతి బిడ్డ అడ్డు తొలగించుకునేందుకు పథకం వేసింది. బిడ్డను మిద్దె మీద నుంచి కిందకు తోసి హతమార్చింది. ఏమీ ఏరుగనట్టు బిడ్డ కనిపించడంలేదని నాటకం ఆడి చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది.

చెన్నై శివార్లలోని సెంబాక్కం తిరుమలైనగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో పార్థిబన్‌ నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు ఐటీ సంస్థలో పార్థిబన్‌ ఇంజినీర్‌. పార్థిబన్‌కు గతంలో శరణ్యతో వివాహం అయింది. ఆమె అనారోగ్యంతో మరణించడంతో కుమార్తె రాఘవి ఆలనా పాలనా చూసుకోవడం పార్థిబన్‌కు కష్టంగా మారింది. చివరకు రెండేళ్ల క్రితం సూర్యకళను వివాహం చేసుకున్నాడు. తొలి నాళ్లలో రాఘవిని తన బిడ్డ వలే ఎంతో ప్రేమగా సూర్య కళ చూసుకుంది.

అయితే, ఏడాదిన్నర క్రితం తన కడుపున వియన్‌ జన్మించడంతో రాఘవిని దూరం పెట్టడం మొదలెట్టింది.మంగళవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన కాసేపటికి రాఘవి కనిపించడం లేదంటూ సూర్యకళ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో పార్థిబన్‌ ఆందోళనకు గురయ్యాడు.
అపార్ట్‌మెంట్‌ చుట్టు పక్కల గాలించగా, ముళ్ల పొదళ్లలో రాఘవి పడి ఉండడంతో ఆందోళనతో అక్కడికి వెళ్లి చూశారు. పాప మరణించి చాలా సేపు అవుతున్నట్టుగా వైద్యులు తేల్చడంతో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరింది.

ఆమెపై అనుమానంతో పోలీసులు విచారించారు.తన బిడ్డ కోసం సవతి తల్లి బిడ్డను అడ్డు తొలగించుకోవాల్సి వచ్చినట్టు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ మేరకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న దృష్ట్యా, మూడో బిడ్డ వద్దంటూ పార్థిబన్‌ సూర్యకళను కొద్ది రోజులుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. తన సంపాదన ప్రస్తుతం చాలడం లేదని, మూడో బిడ్డ వద్దని ఆబార్షన్‌ చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చి ఉన్నాడు.

తన బిడ్డకు అడ్డుగా రాఘవి ఉండడంతోనే ఆమె తల్లి వద్దకు పంపించేందుకు పథకం వేసి, పై నుంచి కిందకు తొసి ఏమీ ఏరుగనట్టుగా వచ్చి భర్తకు ఫోన్‌ చేశానని, అయితే, తాను పెద్ద తప్పు చేశానంటూ బోరున విలపించినా, కసాయి తనం ఆమెను కటకటాల్లోకి నెట్టింది.