తల్లి లేని ఆ బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారిని కామ పిశాచిలా వెంటాడాడు. తాగొచ్చి అతడు చేసే అసభ్య ప్రవర్తనకు వారు రోజూ నరకం చూశారు. అతడు మరింత బరితెగించడంతో చివరకు వారే ఆత్మరక్షణ కోసం తండ్రిని అంతమొందించారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి(45) భార్య ఏడాది కిందట మరణించింది. వారికి 16, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలున్నారు.

భార్య మరణం తర్వాత అతడు పిల్లలతోనే కలిసి నివసిస్తున్నాడు. తాగుడుకు బానిసైన అతడు ఇంట్లో కుమార్తెలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడు. సోమవారం రాత్రి వారిని లైంగికంగా వేధించాడు. దీంతో తిరగబడ్డ బాలికలు అతడి గొంతును తాడుతో బిగించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు.