తల్లికి ఎఫైర్లు ఉన్నాయని పెళ్లి కాకుండా చేస్తానంటూ బెదిరించి బైక్‌పై బలవంతంగా ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడని విద్యార్థిని ఫిర్యాదు చేసింది. తల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టి కూతురిని లొంగదీసుకోవాలని యత్నించాడో కీచకుడు. మీ అమ్మకి వివాహేతర సంబంధాలు ఉన్నాయని అందరికీ చెబుతానని ఇక నీకు పెళ్లి కాకుండా చేస్తానని బెదిరించి కూతురిపై నీచానికి ఒడిగట్టాడు. తీరా యువతి ధైర్యం చేసి డయల్ 100కి ఫోన్ చేయడంతో కథ అడ్డం తిరిగింది. కీచకుడు కటకటాలపాలయ్యాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడుకి చెందిన నవీన్(29) నగరంలో గ్రాఫిక్ డిజైనర్‌‌గా పనిచేస్తున్నాడు. రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్న నవీన్ అదే ప్రాంతానికి చెందిన యువతిని వెంబడిస్తూ వేధింపులకు గురిచేసేవాడు.

మీ అమ్మకి పలువురితో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆ విషయం మీ కుటుంబ సభ్యులకి, బంధువులకి చెప్పి నీకు పెళ్లి కాకుండా చేస్తానని బెదిరించేవాడు. తనతో రాకపోతే అంతు చూస్తానంటూ ఆమెను బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. రెండు రోజుల కిందట నవీన్ యువతి ఇంటికి వెళ్లి తలుపు తీయాలని బెదిరించాడు. వేధింపులు భరించలేకపోయిన యువతి ధైర్యం చేసి డయల్ 100కి ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. నవీన్ తనను వేధిస్తున్నాడని బలవంతంగా బైక్ ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనతో రాకపోతే తన తల్లికి అక్రమ సంబంధాలు ఉన్నాయని పెళ్లి కాకుండా చేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.