లాక్‌డౌన్ నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా చూసేందుకు పోలీసులు తలమునకలవుతున్నారు. అయితే ఈ తరుణంలో సహీబాబాద్ పోలీస్ స్టేషన్‌లోకి ఓ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె అలా రావడం చూసి అక్కడి పోలీసులు కూడా ఖంగారు పడ్డారు. ఆమె ఏడుస్తోంది. విషయం ఏంటని అడగ్గా.. ‘అయ్యా నా కొడుకును కూరగాయలు తీసుకురమ్మని మార్కెట్‌కు పంపించాను. కానీ అతడు కూరగాయలతో పాటు కోడలిని కూడా తీసుకొచ్చాడు.

ఈ పెళ్లికి నేను ఎలా ఒప్పుకోలేను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి చేరుకుని కొడుకు, కోడలితో మాట్లాడారు. తనకు రెండు నెలల క్రితమే వివాహమైందని, తన భార్య పేరు సవిత అని, తామిద్దరం హరిద్వార్‌లో పెళ్లి చేసుకున్నామని 26 ఏళ్ల గుడ్డు తెలిపాడు. పోలీసులు మ్యారేజ్ సర్పిఫికెట్ అడగ్గా, ‘పెళ్లి చేసుకున్న సమయంలో సరైన సాక్షులు లేకపోవడంతో అక్కడి అధికారులు సర్టిఫికేట్ ఇవ్వలేదని, అయితే అక్కడకు మళ్లీ వెళ్లాలనుకున్నాని, కానీ లాక్‌డౌన్ వల్ల కుదరలేదని చెప్పుకొచ్చాడు.

‘పెళ్లి జరిగినప్పటినుంచి నా భార్యను ఢిల్లీలోని ఓ అపార్టుమెంటులో ఉంచాను. అయితే కరోనా కారణంగా ఇంటి ఓనర్ ఆమెను ఖాళీచేయమని ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఆమెను మా అమ్మ దగ్గరకు తీసుకొచ్చాను’ అని గుడ్డు చెప్పాడు. ఇదంతా విన్న పోలీసులు సవిత అద్దెకుంటున్న అపార్టుమెంటు ఓనర్‌తో మాట్లాడారు. లాక్‌డౌన్ అమలులో ఉన్నంత కాలం భార్యా, భర్తలిద్దరినీ ఇంట్లో ఉండనివ్వాల్సిందిగా ఓనర్‌కు సూచించారు. ఇదిలా ఉంటే గుడ్డు తల్లి మాత్రం తన కొడుకు పెళ్లిని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు. ఈ పెళ్లి చెల్లదని, తన కొడుకును తనకు అప్పగించాలని పోలీసులను కోరింది.