హైదరాబాద్ లో డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 9 మందికి రూ.10,500 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వారాంతాల్లో పట్టుబడిన మందుబాబులను ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక కోర్టుల్లో హాజరు పరచగా న్యాయమూర్తులు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జరిమానాను విధించారు.

అంతకుముందు న్యాయమూర్తులు మోటారు వాహన సవరణ చట్టంలోని నిబంధనలను పరిశీలించి ఎం.వి.చట్టం 185(ఎ) ప్రకారం కొత్త జరిమానా విధించాలన్న నిర్ణయం తీసుకున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా, జైలు శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉండడంతో దేశంలో ఎక్కడైనా సరే కొత్త జరిమానాలను విధించవచ్చని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

పార్లమెంటులో ఆమోదం పొందిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019ను హైదరాబాద్‌ ప్రత్యేక కోర్టులు ఇలా అమలు చేయడం ప్రారంభించాయి.