టీఎస్ ఆర్టీసీ కార్మికులు 52 రోజులుగా చేస్తున్న సుదీర్ఘ సమ్మెకు పుల్‌స్టాప్ పడింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు టీఎస్ RTC జేఏసీ నేతలు ప్రకటించారు.

మంగళవారం నుంచి కార్మికులందరూ విధులకు హాజరవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. అయితే ఇదే సమయంలో ఇన్ని రోజులు బస్సులను నడిపిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు రేపటి నుంచి విధులకు హాజరవ్వొద్దంటూ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వారికి విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తికి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు స్పందిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దసరా పండుగ రోజున సమ్మెకు దిగారు.

ఈ చర్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సీఎం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలని రవాణాశాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం భారీ ఎత్తున తాత్కాలిక డ్రైవర్లు, కండర్లను నియమించారు. కార్మికులు సమ్మెలో ఉన్న ఈ 52 రోజులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లే బస్సులను నడిపారు. ఈ క్రమంలో నేడు సమ్మె విరమిస్తున్నాం మీరు రావొద్దు అంటే వారు వింటారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.