కరోనా లాక్‌డౌన్‌లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని జూన్ 30 వరకూ మూసివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ, దీనిపై టీటీడీ పాలక మండలితో చర్చించి నిర్ణయం తీసుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఐతే, ఈ విషయాన్ని టీటీడీ పాలక మండలి ఖండించింది. ఇలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని తెలిసింది. సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి కథనాలు నమ్మవద్దని కోరింది. ప్రభుత్వం లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని టీటీడీ కోరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటం వల్ల టీటీడీ, ఆలయంలో మే 3 వరకూ భక్తులకు అనుమతి లేదు. ఐతే, ఆలయంలో స్వామి వారికి రోజువారీ కైంకర్యాలు, పూజలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఆలయంలో భక్తులకు ఎప్పుడు అనుమతి ఇచ్చేది టీటీడీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
సాధారణంగా సెలవు రోజులు కాబట్టి ఈ వేసవి సమయంలో తిరమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లేవారు.

అలాంటిది ఈ కరోనా వల్ల మొత్తం తేడా వచ్చేసింది. తిరుమలకు భక్తుల రాక ఆగిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి పరిస్థితి వీలైనంత త్వరగా సమసిపోవాలని భక్తులు కోరుకుంటున్నారు.
నెల రోజులుగా శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆదాయం టీటీడీ కోల్పోయింది. గత నెల 19 నుంచి టీటీడీ ఘాట్‌ రోడ్లను మూసివేసింది. 20 మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసింది.