సిఎం కెసిఆర్‌తో పాటు కుటుంబసభ్యులు, పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యూసుఫ్‌గూడ కార్మికనగర్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ మెయిన్ అనే విద్యార్థి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు 504, 505 (1) (సీ), 505 (2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మల్లన్న టిఆర్ఎస్ పాలనపై గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ సామాజిక మాధ్యమలో ప్రచారం చేస్తున్నారు. అంతేగాక టిఆర్ఎస్ నేతలపై, ఎంఎల్ఎలపైనా కూడా నేరుగా విమర్శలు చేస్తుండటంతో పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి.