మంచిర్యాల: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కాసిపేట మండలం మల్కపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్‌, పద్మ దంపతులు గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో గదిలో వారి కొడుకు అక్షయ్‌ (17), కూతురు సౌమ్య (19) మృతదేహాలున్నాయి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే, కూతురు సౌమ్య ఇటీవల అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది.

సౌమ్య అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో జిల్లాలో సంచలనంగా మారగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.