వరంగల్: తెలంగాణలో మద్యం ధరలను పెంచుతూ… రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లిక్కర్ ధరలు 10% వరకు పెరిగాయి. పెరిగిన ధరలకు సంబంధించిన పట్టికను ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం (డిసెంబర్ 16) విడుదల చేశారు. పెరిగిన ధరలు ఎల్లుండి (బుధవారం) నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

లైట్ బీరుపై ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తుండగా, ఇకపై రూ.110 వసూలు చేయనున్నారు. స్ట్రాంగ్ బీర్లపై రూ.12 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఇక మద్యం ఫుల్ బాటిల్ ధర ఆయా రకాల బ్రాండ్‌ను బట్టి రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగాయి. సాధారణ మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 అదనంగా వసూలు చేయనున్నారు.

రాష్ట్రంలో దిశ, సమత లాంటి అత్యాచార ఘటనల నేపథ్యంలో మద్యం విక్రయాలపై నియంత్రణ విధించాలని మహిళలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తీవ్రమైన నేరాలన్నింటికీ మద్యమే కారణం అవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం ధరల పెంపును ప్రభుత్వం ఓ మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.