తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మద్యం అమ్మకాల సమయాన్ని పొడిగించింది. అదనంగా మరో రెండు గంటలు అంటే ఇకపై రాత్రి 8 గంటల వరకూ వైన్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. లాక్ డౌన్ 4లో రాత్రి 7 నుంచి కర్ఫ్యూ ఉండటంతో సాయంత్రం 6 గంటలకే మద్యం షాపులు బంద్ చేసేవారు. కానీ, లాక్ డౌన్ 5 లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ సమయాన్ని కేంద్రం మార్చిన సంగతి తెలిసిందే. దీంతో మరో రెండు గంటల పాటు అంటే రా.8 గంటల వరకు మద్యం దుకాణాలు కూడా తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

2 గంటలు అదనంగా అమ్మకాలకు అనుమతి:


లాక్‌డౌన్ 5.0ను కేంద్రం విధించినప్పటికీ, ఆంక్షలను కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అలాగే కర్ఫ్యూ సమయాన్ని తగ్గించారు. దీంతో.. దాదాపు అన్ని షాపులు కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని చోట్ల యధావిధిగా తెరిచి ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా రాత్రి 8 గంటల వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచనున్నారు. దీంతో అదనంగా మరో 2 గంటల పాటు మద్యం కొనుగోలుకు అవకాశం కలగడంతో మందుబాబులు మరింత సంబరపడుతున్నారు. ఈ నిర్ణయంతో లిక్కర్ సేల్స్ కొద్దిమేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వానికి కూడా మరికొంత ఆదాయం లభించనుంది.