తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. లాక్‌డౌన్ గేట్లు ఎత్తేశాక రాష్ట్రంలో భారీ మొత్తంలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఒకప్పుడు రోజు 100 కేసులైతేనే, వామ్మో అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ఏకంగా 800కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం:

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 879 మందికి పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు చనిపోయారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 652, మేడ్చల్‌లో 112, రంగారెడ్డిలో 64, వరంగల్ రూరల్‌లో 14, కామారెడ్డిలో 10, వరంగల్ అర్బన్‌లో 9, జనగాంలో 7, నాగర్ కర్నూలులో 4, సంగారెడ్డి, మహబూబాబాద్‌లో 2 కేసుల చొప్పున, మెదక్‌లో ఒక కేసు నమోదయ్యాయి. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 220 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,109 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 3,006 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,217 మందికి నెగెటివ్ వచ్చింది. 879 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 63,249 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.