అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని మునిగడప గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. మృతురాలు బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నెమురగొండ మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కాసాని పావని(26)కి సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప గ్రామానికి చెందిన కాసాని నాగరాజుతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం పావని అనారోగ్యంతో మృతి చెందిందని భర్త నాగరాజు పావని కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా తెలిపాడు. పావని కుటుంబ సభ్యులు అదేరోజు రాత్రి మునిగడప చేరుకున్నారు.

కాగా, బుధవారం అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా పావని శరీరం వెనుకభాగంలో గాయాలు ఉన్నాయని పావని కుటుంబ సభ్యులు గుర్తించారు. భర్త నాగరాజు హత్య చేశాడని ఆరోపిస్తూ అంత్యక్రియలను ఆపేసారు. నాగరాజుపై దాడి చేస్తూ ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ కృష్ణమూర్తి ఘటన స్థలానికి చేరుకుని మృతి గల కారణాలను తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.