అదో ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తోంది. అర్ధరాత్రి సూర్యాపేట దాటింది. ఆ సమయంలో ఒక డ్రైవర్ బస్సు నడుపుతుండగా మరో డ్రైవర్ బస్సు రెస్ట్ తీసుకుంటున్నాడు. బస్సులో అందరూ నిద్రపోతున్న వేళ వెనక సీటులోకి వచ్చాడు. అక్కడ ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అరిస్తే చంపేస్తానని బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతే కాదు తన వద్ద నుంచి డబ్బును కూడా కాజేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 28 ఏళ్ల మహిళ హైదరాబాద్‌లో బేబీ కేర్ టేకర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విభేదాలు రావడంతో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఆమె మాదాపూర్‌లో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. ఐతే ఫిబ్రవరి 23న సొంతూరికి వెళ్లేందుకు కూకట్‌పల్లిలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. ఆమెకు చివరి సీటు కేటాయించారు. బస్సులో తక్కువ మందే ప్రయాణికులు ఉండడంతో చివర్లో ఈమె ఒంటరిగా ఉంది. అప్పటికే రాత్రి 10 దాటడంతో అందరితో పాటు ఆమె కూడా నిద్రపోయింది.

బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఒకరు బస్సు నడుపుతుండగా మరొక డ్రైవర్ రాజేశ్ (35) విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఐతే బస్సు సూర్యాపేట దాటగానే ఆ బస్సు డ్రైవర్ వెనక సీట్లోకి వచ్చాడు. అప్పటికే బస్సులో ఉన్న ప్రయాణికులంతా నిద్రపోయారు. చివరి సీట్లో ఉన్న ఆ మహిళ కూడా నిద్రపోయింది. డ్రైవర్ ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె మెలకువ వచ్చి గట్టిగా అరిచే ప్రయత్నం చేసింది. కానీ అతడు నోటికి అడ్డంగా చేయి ఉంచి బెదిరించాడు. అరిస్తే చంపేస్తానని హెచ్చరించడంతో ఆమె అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత డ్రైవర్ ఆమెను అత్యాచారం చేశాడు. ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలోని తన స్థలం రాగానే ఆమె దిగిపోయింది. ఐతే బస్సు దిగుతున్న సమయంలో తనను బెదిరించి రూ.7వేలు కూడా లాక్కున్నాడని బాధితురాలు కన్నీరుపెట్టుకుంది. ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయం కుటుంబ సభ్యులకు వివరించింది. తన బంధువులతో కలిసి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

శనివారం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, దౌర్జన్యం కేసులు నమోదు చేసినట్లు సీఐ నర్సింగ్ రావు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె బంధువలు ఆందోళనకు కూడా దిగారు. గవర్నర్ తమిళిసై జేఎన్‌టీయూలో స్నాతకోత్సవానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆమె కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని బాధితురాలి మాటల్లో కొన్ని నమ్మకశ్యంగా లేవని త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు బాధితురాలి మాటల్లో కొన్ని నమ్మకశ్యంగా లేవని త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.