సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఓ సాధారణ కానిస్టేబుల్ అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కోనేరి ఆంజనేయులు ఈ నెల 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాదు బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విగతజీవుడయ్యాడు. ఆయనను వైద్యులు బ్రెయిన్ డెడ్ అని తేల్చారు. సీపీ సజ్జనార్ సూచన మేరకు ఆంజనేయులు అవయవాలను కుటుంబ సభ్యులు ఇతరులకు దానం చేశారు. ఇక, ఆంజనేయులు కానిస్టేబుల్ గా అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన అంతిమయాత్రలో సీపీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. పాడె మోసి తమ పోలీసు సహచరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.