కాపాడాలని పోలీ‌స్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళపై కామంతో కన్నేసిన ఓ ఖాకీ అధికారి చివరకు చెప్పుదెబ్బలు తినాల్సి వచ్చింది. వయసు తారతమ్యం చూడకుంగా, న్యాయం చేస్తానని, కుటుంబంలో ఓ సభ్యుడిగా భావించాలని నమ్మబలికాడు. ఆ తరువాత మనసులోని మాట బయటపెట్టి, ఆమె కుదరదని తెగేసి చెప్పడంతో మహిళను బెదిరించడం, అన్యాయాన్ని అధికార పార్టీలోని ఓ పెద్దకు చెప్పగా, శనివారం చెప్పుదెబ్బలతో సత్కారం జరిగింది. ఏఆర్‌ నుంచి సివిల్‌కు బదిలీపై వచ్చిన ఓ అధికారి నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సంసారంలో ఇబ్బందులు, ఇద్దరు పిల్లలను వదిలి భర్త సూర్యాపేటకు వెళ్లిపోగా ఆ మహిళ నకిరేకల్‌లో ఒంటరిగా ఉంటోంది. భర్త కోసం ఆమె పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కింది. 50 ఏళ్ల వయసున్న ఆ ఖాకీ అధికారి నీ సంసారాన్ని చక్కబెడతా, ఎలాంటి బెంగ వద్దు అంటూ మాటలతో నమ్మించాడు. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్‌ చేయి, నీ కుటుంబంలో ఓ మనిషి అనుకో అంటూ మాయమాటలు చెప్పాడు.

కొద్దికాలం తరువాత తన లైంగిక వాంఛ తీర్చాలని వేధించడం మొదలు పెట్టాడు. ఊహించ ని పరిణామంతో 25 ఏళ్ల ఆ మహిళ పోలీస్‌ అధికారికి చిక్కకుండా, భయంతో తప్పించుకు తిరగడం ప్రారంభించింది. అయినా వదలని అతడు ఫోన్‌లో బెదిరింపులు, అసభ్య పదజాలం ఉపయోగించడం మొదలుపెట్టాడు. సంసారం చక్కబెట్టమంటే, ఇదేంటని ఆమె పుట్టింటి వారు నకిరేకల్‌లోని ఓ కీలక అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. పోలీసు అధికారి వేధింపులు, అసభ్యపదజాలం అన్నీ ఆ యువతి సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. శనివారం ఆ ప్రజాప్రతినిధి తన క్యాంపు కార్యాలయానికి పోలీసు అధికారిని పిలిపించి, సెల్‌ఫోన్‌ రికార్డులు వినిపించారు. సదరు అధికారి తప్పయిందని అందరి ముందు ఒప్పుకోగా, ఆ మహిళ చెప్పుదెబ్బలతో సత్కారం చేసి వదలిపెట్టింది.