హైదరాబాద్‌: రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల కోసం ప్రభుత్వం రూ.22 కోట్లు విడుదల చేసింది. దాదాపు 900 మందికి లబ్ధి చేకూరనుంది. గతంలో రూ.50 వేల నగదు ఇచ్చేది. దానిని పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర సామాజిక న్యాయశాఖ సూచించింది. కేంద్రం రాష్ట్రాల వారీగా పరిమిత సంఖ్యలో అర్హులకు రూ.2.5 లక్షల చొప్పున ఇస్తోంది. కేంద్ర ప్రోత్సాహకం లభించని వారికి రాష్ట్ర ప్రభుత్వం అంత మొత్తం ఇచ్చేందుకు వీలుగా 2019 అక్టోబరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర మార్గదర్శకాల మేరకు అర్హులైన దంపతులకు మూడేళ్ల కాల పరిమితితో ఆ మొత్తాన్ని బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి ఇవ్వాలి. మూడేళ్ల తర్వాత వారు దానిని నగదు రూపంలోకి మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ రెండేళ్లలో కేవలం రూ.7 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. సంక్షేమ శాఖల్లో వసతి గృహాలు మూతపడటంతో ఆ మిగులు నిధులను సర్దుబాటు చేసి ప్రభుత్వం తాజాగా రూ.22 కోట్లు విడుదల చేసింది.