చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని రాంనగర్ కాలనీలో నివాసముండే తొర్పునూరి వెంకటేష్ ఉమారాణి (32) దంపతులకు గత 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు కూతుళ్లు హర్షిణి (12), లాస్య (8), శైని (3) సంతానం కలిగారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త వెంకటేష్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి జేబు గుల్ల చేసుకుని ఇంటికి రావడం, ఇంట్లో డబ్బులు ఇవ్వక పోవడంతో కుటుంబంలో ఆర్ధిక సమస్యలు పెరిగాయి. ఎదుగుతున్న ముగ్గురు ఆడ పిల్లలను పోషించేందుకు భార్య ఉమారాణి ఇంటి వద్దనే చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతూ అష్ట కష్టాలతో బ్రతుకు వెళ్లదీస్తుంది. తాగుడు మాని వేయమని భార్య పదే పదే నచ్చ చెప్పినా అతడిలో మార్పు కనిపించలేదు. రోజు రోజుకూ పెరుగుతున్న ఖర్చులతో కుటుంబాన్ని నడపడం ఆమెకు కష్టతరంగా మారింది. తాగుడు మానమని ఎంతచెప్పినా భర్త వినక పోవడం, అదిచాలక మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో తరచూ గొడవ పడడం సర్వ సాధారణంగా మారి పోయింది. దీంతో బ్రతుకు బండి లాగడం కష్టతర మవడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త వెంకటేష్ భార్యతో గొడవపడి ఆరు బయట పడుకోగా జీవితంపై విరక్తి చెందిన ఉమారాణి (32) ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

తాము నివాస ముంటున్న రేకుల ఇంటి వాసానికి పెద్ద కుమార్తె హర్షిణి (12), రెండవ కుమార్తె లాస్య (8) లకు ఒక చీరతో ముందుగా ఉరివేసింది. తరువాత మరో చీరను వాసానికి తగిలించి ఒకవైపు చిన్న కుమార్తె శైని (3) మెడకు ఉరి బిగించి మరోవైపు తన మెడకు బిగించుకుంది. దీంతో తల్లి ఉమారాణి, కుమార్తెలు హర్షిణి, లాస్య లు మృతి చెందగా తల్లి బరువుతో వాసం వద్దకు చేరిన చిన్న కుమార్తె శైని ప్రక్కనే వున్న సజ్జపై కూర్చుని ప్రాణాలు కాపాడుకుంది. ఉదయాన్నే ఇంట్లో చిన్నారి ఏడుపులు విన్న ఇరుగు పొరుగు వారు తలుపులు తెరిచి చూడగా వాసాలకు ముగ్గురి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. వెంటనే ప్రాణాలతో వున్న చిన్నారి శైని ని మెడకున్న చీరను విప్పి కిందకు దించారు. ఇదిలావుండగా ఒకే ఇంట్లో తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలిచి వేసింది. మృతుల బంధువుల రోధనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. మృతదేహాలకు చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపు తున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు.