హైదరాబాద్‌: తమిళ స్టార్‌ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జైభీమ్‌. సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్‌. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్‌ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్‌హిట్‌ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. అయితే జై భీమ్‌ చిత్రం విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి హీరో సూర్య, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) హీరో సూర్యకు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు. ‘జై భీమ్‌ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తున్నా. చిత్రం బృందానికి ముందస్తుగా నా అభినందనలు’ అని ఆమె ట్వీట్‌ చేశారు. అయితే ఆమె చేసిన ట్వీట్‌కు హీరో సూర్య స్పందించారు. ‘కృతజ్ఞతలు మేడం మా చిత్రం బృందం తరఫున మీకు కృతజ్ఞతలు’ అని సూర్య రిప్లై ఇచ్చారు.