పెళ్లయిన 11 రోజులకు మొదటి రాత్రే వరుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం: గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్నకుమారుడు సోమేశ్‌ అలియాస్‌ సోమయ్య (27)కు ఈనెల 3న నాగారం మండలం ఫణిగిరికి చెందిన మేనమామ కూతురుతో వివాహమైంది. అనంతరం సంప్రదాయానుసారం 11వ రోజున మొదటిరాత్రికి మంగళవారం రాత్రి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలో సోమేశ్‌ తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అన్న ఫోన్‌ చేయగా సోమేశ్‌ ఫోన్‌ ఎత్తలేదు.

అంతలో అతని స్నేహితులు రాత్రయిందంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. సోమేశ్‌ కూడా ఇంటికి వెళ్తున్నానని చెప్పి, గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పూరింట్లోకి వెళ్లి తాడుతో వెన్నుకర్రకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోపక్క సోమేశ్‌ కోసం బంధువులు ఫోన్‌లో ప్రయత్నిస్తూనే రాత్రంతా ఎదురుచూశారు. బుధవారం తెల్లవారుజామున అతడి స్నేహితులను వాకబు చేయగా ఇంటికి వెళ్తున్నానని చెప్పాడని తెలిపారు. దీంతో చుట్టుపక్కల గాలించగా, పూరి గుడిసెలో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.