రామాయంపేట(మెదక్‌): ఎన్నో కలలతో నూరేళ్ల దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన యువజంటను ఏడాది పూర్తి కాకముందే మృత్యువు కబలించింది. అగ్ని సాక్షిగా ఏడడుగులు నడిచిన వారి బంధం ఏడు నెలలకే అర్థాంతరంగా ముగిసింది. వినాయక నవరాత్రి ఉత్సవాలకు హాజరైన దంపతులు తిరుగు ప్రయాణంలో మేడ్చల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం: రామాయంపేట పట్టణానికి చెందిన చకిలం శ్రీనివాస్, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సాయిరాజ్‌ (28) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవరిలో గజ్వేల్‌కు చెందిన సారికను వివాహం చేసుకొని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీకెండ్‌తో పాటు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రామాయంపేటకు వచ్చారు.

కుటుంబ సభ్యులు, బంధువులతో ఉత్సాహంగా గడిపి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో మేడ్చల్‌ వద్ద రోడ్డు దాటుతున్న ప్రయాణికుడిని ఢీకొట్టి దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. వెనకనుంచి వచి్చన లారీ వారిపై నుంచి వెళ్లగా ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌ ఢీకొని తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడు సైతం మృతి చెందాడు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడిఉన్న దంపతులను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ముందు రోజు వరకు కళ్ల ముందే సంతోషంగా గడిపిన దంపతులిద్దరూ మృత్యువాత పడడంతో రామాయంపేటలో విషాదం నెలకొంది.