ప్రసవానంతరం తీవ్ర రక్తస్రావంతో సర్పంచి తిరుమల పార్వతి(26) మృతి చెందారు. రాయికోడ్‌ మండలం జంబ్గి(కె) సర్పంచి తిరుమల పార్వతి శనివారం పురుటి నొప్పులతో బాధపడుతుండగా రాయికోడ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. సాధారణ కాన్పులో భాగంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో అధికంగా రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్సకు వైద్యులు జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రికి ప్రతిపాదించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రి నుంచి సంగారెడ్డిలోని జిల్లా దవాఖానాకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం జంబ్గి(కె)లో అంత్యక్రియలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ పార్వతి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సర్పంచి భర్త తిరుమల శ్రీకాంత్‌ను ఓదార్చారు. రాయికోడ్‌ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పార్వతి మృతిచెందినట్టు శ్రీకాంత్‌, బంధువులు ఎమ్మెల్యేకు విన్నవిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై రాయికోడ్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రవణ్‌ను వివరణ కోరగా, ప్రసూతి అనంతరం రిటన్‌ ప్లాజెంటా బయటకు రాకపోవడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. ఈ కారణంగా మెరుగైన చికిత్సకు సిఫారసు చేశామని, వైద్య చికిత్స అందించినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించినట్టు పేర్కొన్నారు.