భద్రాద్రి కోత్తగుడంః జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు యువతిని ట్రాప్‌ చేశాడు. అతడి మాటలు నమ్మిన సదరు యువతి శారీరకంగా దగ్గర కావడంతో గర్భం దాల్చింది. అతడి వల్ల చివరకు ప్రాణాలు విడిచింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారంః ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతితో పుసుగుడెంకు చెందిన భూక్యా నందుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో, ఆమెను పెళ్లి చేసుకుంటానని నందు ట్రాప్‌ చేశాడు. ప్రేమ పేరిట ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో బాధితురాలు గర్భం దాల్చింది. 5 నెలల గర్భవతి కావడంతో అబార్షన్‌ కావడానికి మాత్రలు ఇచ్చాడు. కానీ, ఆమెకు అబార్షన్‌ కాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాధితురాలు, నందు, మరో మహిళ కలిసి భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి తన భార్యకు తీవ్ర రక్తస్రావం అవుతుందని చెప్పి అడ్మిట్‌ చేశాడు. కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో, నందుతోపాటు ఆసుపత్రికి వచ్చిన అమ్మాయి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో బాధితురాలు మృతిచెందింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తన బిడ్డను నందు బలితీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.