నీ ఇద్దరు పిల్లల్ని అమ్మేస్తాం అని బెదిరించి వేములవాడ పట్టణానికి చెందిన ఓ వివాహితను బలవంతంగా మహారాష్ట్రలోని నాసిక్‌ ప్రాంతానికి చెందిన బాబు లక్ష్మణ్‌ జగపత్కు మూడో పెళ్లి చేసిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వివాహితకు నాలుగేళ్ల కుమారుడు, ఏడాది పాప ఉన్నారు. ఇంట్లో తరచూ భర్తతో గొడవ కావడంతో విసుగెత్తిన వివాహిత మార్చి 4న ఇంటి నుంచి వెళ్లిపోయింది. వేములవాడ నుంచి కామారెడ్డి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరింది. అక్కడే మూడురోజులు గడిపింది. గమనించిన 60 ఏళ్ల వృద్ధురాలు వివాహితను చేరదీసినట్లు నటించింది. పని ఇప్పిస్తానని చెప్పి మహారాష్ట్రలోని పర్భాని ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడే ఉన్న రాజారాం అనే వ్యక్తికి రూ.లక్షకు అమ్మేసింది. పది రోజులపాటు తనవద్దే ఉంచేసుకున్న రాజారాం నాసిక్‌ ప్రాంతంలో ఉండే తన బావమరిది బాబు లక్ష్మణ్‌ జగపత్‌కు అప్పగించాడు. అప్పటికే రెండు పెళ్లీలు చేసుకున్న బాబు లక్ష్మణ్‌ జగపత్‌ను పెళ్లి చేసుకోకుంటే పిల్లల్ని అమ్మేస్తామని బెదిరించి బలవంతంగా మూడో పెళ్లి చేశారు.

ఫోన్‌ ట్రాకింగ్‌తో:

8 నెలల క్రితం అదృశ్యమైన వివాహిత ఆచూకీ లభ్యం కాలేదు. ఓ రోజు తన ఆడపడచుకు అన్‌నోన్‌ నంబర్‌తో ఫోన్‌ రావడంతో విషయం బయటపడింది. ఫోన్‌ నంబర్‌ ఆధారంగా వేములవాడ పోలీసులు ఆ ప్రాంతాన్ని కనుగొన్నారు. ఓ పోలీసు బృందం నాసిక్‌ చేరుకుని వివాహిత కోసం ఆరా తీసింది. ఆమెను మోసం చేసిన వ్య క్తిని పట్టుకుని ఈనెల 28న వేములవాడకు తీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాబు లక్ష్మణ్‌ జగపత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలకు వివాహితలు బయటికి వెళ్లి పోయి మాయమాటలు చేప్పే వారి ఉచ్చులో పడొద్దని టౌన్‌ సీఐ వెంకటేశ్‌ సూచించారు. సమస్యలను బంధువుల సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు.