హోంగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఒంటరి మహిళపై కొందరు పైశాచికంగా వ్యవహరించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. ఇల్లందు పట్టణంలోని ఎల్‌బీఎస్‌ నగర్‌లో నివాసముంటున్న మహిళ ఒంటరిగా జీవిస్తూ స్థానికంగా ఓ కిరాణా షాపులో పనిచేస్తోంది. ఇల్లందు పోలీస్‌స్టేషన్లో పనిచేసే హోంగార్డ్ నరేష్‌తో ఆమెకు పరిచయముంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లిన నరేష్ మాట్లాడుతుండగా అతడి తల్లి, భార్యతో పాటు బంధువులు ఒక్కసారిలో లోనికి వచ్చారు. నరేష్‌ను పక్కకు తోసేసి మహిళపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం ఆమె చేతులు కిటికీకి కట్టేశారు. నరేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని అతడి వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తున్నావంటూ ఆమెను దుర్భాషలాడారు. ఈ పైశాచిక ఘటనను కళ్లప్పగించి చూసిన స్థానికులు ఒక్కరూ అడ్డుచెప్పలేదు.

నరేష్‌కు తనకు మధ్య అక్రమ సంబంధం లేదని బాధితురాలు చెబుతోంది. తనకు అవసరం నిమిత్తం కొందరి దగ్గరి నుంచి నరేష్ అప్పు ఇప్పించాడని, ఆ డబ్బుల వసూలు కోసమే ఆదివారం తన ఇంటికి వచ్చాడని తెలిపింది. అయితే నరేష్‌ కొంతకాలంగా ఇంటికి సక్రమంగా వెళ్లకపోవడంతో అతడికి వేరొకరితో అఫైర్ ఉందని కుటుంబసభ్యులు అనుమానం పెంచుకున్నారు. ఆదివారం ఆ మహిళ ఇంటికి వెళ్లడంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న అనుమానంతోనే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడటంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఖమ్మం బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం 100 రోజుల తర్వాత ఇంటికి, ప్రధాన సూత్రధారి అతడే