వేట కొడవళ్లతో దారుణ హత్య సమయం దాదాపు రాత్రి11 దాటింది. పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న వారితో ఆ రోడ్డు కొంచెం రద్దీగానే ఉంది. అదే సమయంలో ఓ యువకుడిని తరుముకుంటూ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాళ్ల చేతుల్లో కత్తులు, వేట కొడవళ్లు. వారి లక్ష్యం ఆ కుర్రాడ్ని హతమార్చడం. అందరు చూస్తుండగానే ఆ యువకుడు నీరసించి కిందపడిపోయాడు. ఇదే సమయంలో అతడ్ని చుట్టుముట్టున ఆ ముగ్గురు.. అతికిరాతకంగా నరికి నరికి చంపేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఓ యువకుడు నడి రోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే ముగ్గురు వ్యక్తులు కత్తులు, వేట కొడవళ్లతో అతడిని నరికి చంపారు. పిల్లర్‌ నంబర్‌ 248 వద్ద ఉన్న హెచ్‌ఎఫ్‌ ఫంక్షన్‌ హాల్‌ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.

రోడ్డుపై వెంబడించి మరీ ఆగంతుకులు దారుణానికి ఒడిగట్టారు. పాతకక్షలా? లేక ఇతర కారణాలు ఇందుకు దారి తీసి ఉంటాయా, అనేది తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు గురైన వ్యక్తి ఎంఐఎం స్థానిక కార్యకర్త మహ్మద్‌ ఖలీల్‌గా గుర్తించారు. డాగ్ స్క్యాడ్ బృందం, ఫింగర్ ప్రింట్స్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.