ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదని తెలిపింది. కొనుగోళ్లు-అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదు కాబట్టి వచ్చే ఏడాది నుండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదని వెల్లడించింది. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.