తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి కేటీఆర్ గురించే చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన్ను సీఎంగా చూస్తామని ప్రచారం జరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు తెలియదని ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి చర్చించరని స్పష్టం చేశారు. బుధవారం ఇన్‌స్టగ్రామ్‌లో ”ఆస్క్ మీ వాటెవర్ యు ఫీల్ లైక్” అనే ట్యాగ్ లైన్‌తో నెటిజెన్లతో ముచ్చటించారు హిమాన్షు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నారు. తాత, తండ్రి బాటలో రాజకీయాల్లోకి వస్తారా? అని ఒకరు అడగ్గా తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, అసలు రాజకీయాలంటే అసహ్యమని చెప్పారు. నెక్ట్స్‌‌ సీఎంగా చూడాలని ఉందని ఒకరు కామెంట్ చేయగా ‘నాకు స్వేచ్ఛ అవసరం’ అని సమాధానమిచ్చారు హిమాన్షు. ఫిబ్రవరి 20 తర్వాత మీ నాన్న కేటీఆర్‌‌ సీఎం అవుతారని ప్రచారం జరుగుతోందని ఇది ఎంత వరకు నిజమని మరొకరు ప్రశ్నించగా ‘మా నాన్న, తాతయ్య ఇంట్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి చర్చించరు.

రిలాక్స్‌‌గా ఉంటారు’ అని క్లారిటీ ఇచ్చాడు హిమాన్షు. కేటీఆర్‌‌ గురించి ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్ అడగడంతో ‘కూల్‌‌’ అని రిప్లై ఇచ్చారు. తాను పదో తరగతి పూర్తి చేశానని చెప్పి హిమాన్షు ఫిబ్రవరి ఒకటి నుంచి కాలేజీకి వెళ్లడం ఇష్టమేనని వెల్లడించారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ హనుమ విహారి ప్రగతిభవన్‌కు వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మీరు కూడా విహారిని కలిశారా? అని ఓ నెటిజన్‌ను అడగ్గా ‘కలవలేదు’ అని చెప్పారు. ‘నేను ప్రగతిభవన్‌‌లో నివాస ప్రాంతం వరకే పరిమితం. పరిపాలనా విభాగం వైపు వెళ్లను’ అని సమాధానం చెప్పారు హిమాన్షు. హిమాన్షు కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక సాయం కోసం ఎవరైనా ట్విటర్‌లో రిక్వెస్ట్ పెడితే వెంటనే స్పందిస్తున్నారు. తన వల్ల అయ్యే సాయం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సమస్యలు పరిష్కరిస్తున్న హిమాన్షును తాతకు దగ్గ మనవడు, తండ్రికి దగ్గ కొడుకు అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక హిమాన్షు అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ, ప్రభుత్వ కార్యక్రమాలు మినహా ఇతర కార్యక్రమాల్లో తాతతో పాటే కనిపిస్తారు హిమాన్షు.