కాంచీపురం జిల్లా మధురాంతకం సమీపంలోని విప్పేడు గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌(24) తన సమీప బంధువు కుమార్తె కౌశల్యను ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు ప్రేమించుకుంటున్నప్పుడే కౌశల్య గర్భం దాల్చింది. రెండు నెలల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. షోళింగనల్లూరు సమీపంలోని సెమ్మంజేరిలో తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న కౌశల్య, బిడ్డను చూసేందుకు రంజిత్‌కుమార్‌ వచ్చాడు. తాను, తన భార్య ఇద్దరూ నల్లగా ఉన్నామని, తమకు పుట్టిన బిడ్డ తెల్లగా ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. భార్యపై అనుమానం వ్యక్తం చేయడం మొదలెట్టాడు. మార్చి మొదటి వారంలో కౌశల్యను తన ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు దీంతో ఆగ్రహించిన కౌశల్య గత వారం తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది.

శుక్రవారం ఉదయం సెమ్మంజేరికి వచ్చిన రంజిత్‌కుమార్‌ కౌశల్యతో గొడవ పడ్డాడు. వీరి గొడవకు బెదిరిన పసిబిడ్డ ఏడుస్తుండడంతో రంజిత్‌ కుమార్‌ ఉన్మాదిగా మారి బిడ్డను గోడకేసి కొట్టి కింద పడేశాడు. తీవ్రంగా గాయపడిన బిడ్డను ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బిడ్డ మరణించినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రంజిత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. పసిబిడ్డ మృతదేహాన్ని రాయపేట ఆసుపత్రికి తరలించారు.