మంచిర్యాల: జిల్లాలోని మందమర్రి పట్టణంలోని అంతరాష్ట్ర రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కొమురయ్య (48), సుజాత (40), కావ్య (18)గా గుర్తించారు.

వీరు కాసిపేట మండలం పెర్కపల్లి లో శుభకార్యానికి హాజరై తెల్లవారు జామున స్వగ్రామమైన లక్సెట్టిపేట తిరుగు ప్రయాణమవుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఒకే కుంటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.