ఇన్నేళ్లూ కలగానే మిగిలిన మెట్రోరైల్‌, త్వరలోనే మహానగర వాసుల దరిచేరబోతున్నది. దేశంలో పురోగమిస్తున్న నగరాల జాబితాలో వరంగల్‌ను నిలపాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర తరహా మెట్రోనియో ప్రాజెక్టును ఇక్కడ నెలకొల్పాలని వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ‘మహామెట్రో’ ఆధ్వర్యంలో డీపీఆర్‌ (డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) సిద్ధమవుతున్నది. మరో మూడు నెలల్లో తుది రూపు రానుండగా, కాజీపేట, పెట్రోల్‌పంప్‌, పోచమ్మమైదాన్‌, వెంకట్రామ టాకీస్‌ మీదుగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌ దాకా దాదాపు 15కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టుకు రూ.1200కోట్ల నుంచి రూ.1400కోట్ల దాకా కావొచ్చని ‘మహామెట్రో’ ప్రతినిధుల బృందం ప్రాథమికంగా అంచనా వేసింది.

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ను అన్ని రంగాల్లో అద్వితీయంగా ముందుంచాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. వరంగల్‌ను విద్యాకేంద్రంగా మలిచి ఇప్పటికే అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ఇక్కడ నెలకొల్పింది. ద్వితీయ శ్రేణి ఐటీ నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతున్నది. పది లక్షల జనాభాతో ఉన్న వరంగల్‌ మహానగరంలో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఇక్కడి రవాణా వ్యవస్థను ఉన్నతీకరించాలనే సంకల్పంతో సర్కారు ముందుకు పోతున్నది. ఈ క్రమంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గత సంవత్సరం ‘మహా మెట్రో’ తరహా వరంగల్‌లో మెట్రో నియో ప్రాజెక్టు ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. దేశంలో పురోగమిస్తున్న నగరాల జాబితాలో వరంగల్‌ను నిలపాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహామెట్రో ప్రాజెక్టును ఇక్కడ నెలకొల్పాలని నిర్ణయించి డీపీఆర్‌(డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌)ను మహామెట్రో ఆధ్వర్యంలోనే తయారు చేయిస్తున్నది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, థానే, పుణె, నాసిక్‌ వంటి నగరాల్లో అనుసరించిన మార్గంలోనే ప్రాజెక్టు ప్రతినిధులు గత డిసెంబర్‌లో వరంగల్‌కు వచ్చి అధ్యయనం చేశారు.

మంత్రి కేటీఆర్‌ చొరవతో మహామెట్రో బృందం, రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఇక్కడి సాధ్యాసాధ్యాలపై తొలి దశ అధ్యయనం చేశారు. అనంతరం జిల్లా యంత్రాంగంతోనే కాకుండా మహామెట్రోలోని వివిధ విభాగాల ప్రతినిధులు దశల వారీగా వచ్చి అధ్యయనం చేస్తున్నారు. మహామెట్రో ప్రతినిధులు ఇప్పటికే అనేక పర్యాయాలు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, వరంగల్‌ మహానగర పాలక సంస్థ, జిల్లా యంత్రాంగంతో సమావేశమయ్యారు. తాజాగా సాంకేతిక అంశాల పర్యవసానాలపైనా సమీక్షించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ ప్రగతి రథ చక్రాలు ఆగకూడదనే సర్కారు సంకల్పాన్ని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

మహామెట్రో ప్రతినిధులు ఏడాది నుంచి అనేక పర్యాయాలు ఇక్కడికి వచ్చి తొలిదశ సర్వే చేశారు. తర్వాత అనేక అంశాలపై శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నారు. కాజీపేట నుంచి పెట్రోల్‌ పంపు, అక్కడి నుంచి పోచమ్మ మైదాన్‌ మీదుగా వెంకట్రామ టాకీస్‌ నుంచి వరంగల్‌ రైల్వే స్టేషన్‌ వరకు దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా కొనసాగే ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్ల దాకా ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వరంగల్‌ మహానగర ట్రాఫిక్‌, ప్రజా, ప్రైవేట్‌ రవాణా వ్యవస్థ ఎలా ఉంది? ప్రజల ఆర్థిక, సామాజిక, వ్యాపార పరిస్థితులపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. ఇటీవల మహామెట్రో టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ సభ్యులు, పోలీసులు, ఆర్టీఏ, ఆర్టీసీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, రైల్వే నెట్‌వర్క్‌ వ్యవస్థలపై సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రూ.కోటితో డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే రెండు మూడు నెలల్లో డీపీఆర్‌కు ఒక రూపం రావొచ్చని కుడా ప్లానింగ్‌ ఆఫీసర్‌ అజిత్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు.

దేశంలో ప్రస్తుతం నాగ్‌పూర్‌, థానే, పుణె, నాసిక్‌ నగరాల్లో అక్కడి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన కోసం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలోనూ మహామెట్రో సౌకర్యం అందుబాటులోకి తేవాలని భావించారు. ఈ మేరకు ఆయన మహామెట్రో (మహారాష్ట్ర మెట్రో) ప్రాజెక్టు సంస్థతో చర్చించి, ఆ ప్రతినిధుల బృందాన్ని గత డిసెంబర్‌లో ఇక్కడికి పంపిన విషయం తెలిసిందే.