ఆమె వేసుకున్నది ఖాకీ డ్రెస్ అయినా, వాటిలో తల్లిమనసు దాగిఉంది. చెన్నైలో పనిచేస్తున్న మహిళా ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి ఎవరోతెలియని, అమ్మానాన్నలు లేని ఓ అనాధ పెళ్లి కూతురుకి పుట్టినింటి సారెపెట్టి ఘనంగా సాగనంపింది. చెన్నై సెక్రటేరియెట్‌ కాలనీ పోలీసుస్టేషన్‌లో రాజేశ్వరి సీఐగా పనిచేస్తున్నారు.తన పోలీసుస్టేషన్‌ పరిధిలో ఉన్న అంధురాలు సుకన్య వారం రోజుల క్రితం రాజేశ్వరిని కలిశారు. తన తల్లిదండ్రులు ఎప్పుడో మరణించారని, తాను, తన సోదరి ప్రీతి పిన్ని సురేఖ పర్యవేక్షణలో ఉన్నట్టు పేర్కొన్నారు. చిన్నాన్న కూలి పనులు చేస్తున్నాడని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టు వివరించారు. తనకు కోయంబత్తూరుకు చెందిన యువకుడితో సెప్టెంబర్‌ 4న పెరంబలూరులో వివాహం జరగనున్నట్టు పేర్కొన్నారు. తన వివాహానికి ఏదేని నగదు సాయం చేయాలని సుకన్య విజ్ఞప్తి చేసుకుంది. అయితే, తాను వివాహానికి పెద్దగా సాయం చేయలేనంటూ ఇన్‌స్పెక్టర్‌ తొలుత నిరాకరించారు.

ఆ తరువాత సుకన్య పరిస్థితి విచారించింది. ఆమె పరిస్థితి దయనీయమని తెలుసుకుంది. దీంతోబంగారు ముక్కుపుడక, చెవి దిద్దులు, వెండిపట్టీలు, బీరువా, మంచం, పట్టు చీర పాటుగా మరికొన్ని చీరలు, ఫ్యాన్, మిక్సీ, గ్రైండర్, వాటర్‌ హీటర్‌ అంటూ ఇంటి సామన్లతో 16 రకాల సారెను తన వంతుగా రాజేశ్వరి కొనుగోలు చేసి ఇవ్వడానికి నిర్ణయించారు. శనివారం రాత్రి తన స్టేషన్‌కు సుకన్యను పిలిపించారు. ఈ సమాచారంతో ఆ పరిసర వాసులు సైతం ఆస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ సుకన్యను కొత్త పెళ్లి కూతుర్ని చేసినట్టుగా పట్టు చీర కట్టించి, పూలమాల వేసి , తన వంతుగా ఆ సారెను అందించి మనస్సున్న రాజేశ్వరిగా అందరి మదిలో ఈ మహిళా ఇన్‌స్పెక్టర్‌ ముద్ర వేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఆశీర్వాదం తీసుకున్న సుకన్య ఆనందానికి అవధులు లేదు. పుట్టింటి సారెగా రాజేశ్వరి ఇచ్చిన కానుకకు తోడుగా ఆ కాలనీ వాసులు పలువురు ముందుకు వచ్చి తమ వంతు సాయానికి సిద్ధమయ్యారు.